కేంద్రం నిధులపై గరం గరం..రాష్ట్రానికి ఏం ఇచ్చామో భట్టి చెప్పారు : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కేంద్రం నిధులపై గరం గరం..రాష్ట్రానికి ఏం ఇచ్చామో భట్టి చెప్పారు : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • మాతో కలిసి రండి.. మోదీ వద్దకు వెళ్దాం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం ఇవ్వలేదని చెప్పడం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. పదేండ్లలో రాష్ట్రానికి ఏమిచ్చామో ఇప్పటికే చెప్పామని, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా ప్రసంగంలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఎన్నికల ముందు అమలు చేయలేని హామీలు ఇచ్చి.. ఇప్పుడు చేతులెత్తేస్తూ కేంద్రంపై విమర్శలు చేయడం తగదని బడ్జెట్​పై చర్చ సందర్భంగా అన్నారు.

మహేశ్వర్ రెడ్డి కామెంట్లపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం బాధ్యతగా ఇవ్వాల్సిన వాటానే అడుగుతున్నామని చెప్పారు. బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, తమతో కలిసి వస్తే ప్రధాని మోదీతో సమావేశం అవుదామని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందామని అన్నారు. బీజేపీ నేతలే పారిపోతున్నారని, తమను నిందిస్తే ఏం లాభమని ఏలేటిని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని తెలిపారు. 

మహేశ్వర్ రెడ్డికి రాష్ట్రంపై ప్రేమ లేదు

15 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రానికి ఏం ఇచ్చిందని విజయరమణా రావు అన్నారు. కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఫండ్స్ ఇస్తే తాము కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆవు పాలు తెచ్చి అభిషేకం చేస్తామని పేర్కొన్నారు. అప్పుడే మహేశ్వర్ రెడ్డి కల్పించుకుని.. ‘‘విజయరమణా రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటి వరకు బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేసింది.

ప్రతి ఒక్కరి అకౌంట్​లో రూ.15 లక్షలు వేస్తామని మేనిఫెస్టోలో ఎప్పుడూ పెట్టలేదు. ఈ అంశం మేనిఫెస్టోలో ఉంటే చూపించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల కుంభకోణం చేసిందని కాంగ్రెస్ నేతలే అన్నారు. అవన్నీ కక్కించి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఏం అయింది?’’అని ఏలేటి అన్నారు. యూరియాపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్నదని, రైల్వే స్టేషన్లు కడ్తున్నదని తెలిపారు. రోడ్లు వేస్తున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు.

దీనిపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ‘‘మహేశ్వర్ రెడ్డికి పార్టీపై ఉన్న ప్రేమ.. రాష్ట్ర ప్రజలపై ఉంటే నిధులు వచ్చేవి. రాష్ట్రానికి వాటా ఇవ్వడం హక్కు. ఇదేమీ ఫేవర్​ కాదు.. రాష్ట్రాల వాటాల్లో హేతుబద్ధత లేదు. బాధ్యతలో భాగంగానే నిధులు ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఏం చేశారు? బీఆర్ఎస్ చేసిన స్కామ్​లపై జ్యుడీషియల్ కమీషన్లు వేసి వాటి రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’’అని శ్రీధర్ బాబు అన్నారు.